మీ ఆస్తి పత్రాలు పోయాయా? – ఆ సమస్యకు పరిష్కారం ఇదే!
అధికారికంగా ఆస్తి సర్టిఫైడ్ కాపీని అందిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ – సీసీ కోసం సబ్–రిజిస్ట్రార్, మీ సేవల్లో దరఖాస్తుకు అవకాశం – దరఖాస్తు చేసిన 24 గంటల్లో అధికారికంగా అందనున్న సర్టిఫైడ్ కాపీ
How To Get Certified Copy of Property in Telugu : ఖాళీ స్థలాలు, గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారికంగా సర్టిఫైడ్ కాపీ(సీసీ)ని అందిస్తుంది. ఈ ధ్రువీకరణ పొందిన దస్తావేజులకు ఒరిజినల్ పత్రాలతో సమానంగా గుర్తింపు ఉంటుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో ఎంతో మంది మానసిక అవేదన చెందుతుంటారు. అటువంటి కష్టాలు పడకుండా ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందామా?
ఆమోద ముద్రతో : ఏదైనా కారణంతో మన ఒరిజినల్ దస్తావేజులు పోగొట్టుకున్నప్పుడు సంబంధించిన నకలు పత్రాలు ఉన్నప్పటికీ వాటికి అధికారికంగా ధ్రువీకరణ ఉండదు. సదరు వ్యక్తి ఆస్తులను అమ్మేటప్పుడు కొనుగోలుదారులు కూడా వాటిని విశ్వసించరు. ఏదైనా న్యాయపరమైన చిక్కులు తలెత్తినప్పుడూ నకలు పత్రాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవు. మన వద్ద ఒరిజినల్ పత్రాలు ఉన్నా సర్టిఫైడ్ కాపీలను మాత్రమే కోర్టులకు సమర్పించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ టైంలో ప్రతి దస్తావేజును స్కానింగ్ చేసి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌లో భద్రంగా ఉంచుతారు. సర్టిఫైడ్ కాపీ కోసం అప్లై చేసుకున్నప్పుడు వాటి నకలు పత్రాలను ఆ శాఖ ఆమోద ముద్రతో ధ్రువీకరిస్తుంది. దీంతో సదరు పత్రాలకు ఒరిజినల్ వాటికి సమానం అయిన గుర్తింపుతో పాటు చట్టబద్ధత ఉంటుంది. దీన్నే రిజిస్ట్రేషన్ శాఖ పరిభాషలో సీసీ కాపీగా అంటారు.
సర్టిఫైడ్ కాపీని ఎలా పొందాలంటే? : ఒరిజినల్ దస్తావేజులకు ప్రత్యామ్నాయంగా సర్టిఫైడ్ కాపీని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకునే అవకాశం ఉంద. మీ సేవా కేంద్రం లేదా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ద్వారా తీసుకోవచ్చు. మీ సేవలో రూ.510, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దరఖాస్తుకు రూ.50 స్టాంపు పేపర్‌ను జతచేయాలి. ఆస్తికి సంబంధించిన దస్తావేజు సంఖ్య (డాక్యుమెంట్ నంబరు), రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం, హద్దులు, విస్తీర్ణంతో పాటు దరఖాస్తుదారుడి డిటైల్స్ తెలపాల్సి ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోయినా డాక్యుమెంట్ నంబరు, రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం కచ్చితంగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన ఒక్కరోజులో అధికారికంగా ధ్రువీకరించిన సర్టిఫైడ్ కాపీ మనకు ఇస్తారు.
ఓనర్ ఆస్తులను అమ్మే హక్కులు ఎప్పుడు వస్తాయంటే? : సీసీ కాపీతో సదరు ఆస్తులను అమ్మే అధికారం ఓనర్‌కి పూర్తి స్థాయిలో రాదు. కొందరు మోసగాళ్లు ఒరిజినల్ పత్రాలను తనఖా పెట్టి సీసీ కాపీతో ఆస్తులను అమ్మే ప్రమాదం ఉంది. దీంతో పోలీసు ఎఫ్‌ఐఆర్ తప్పనిసరి చేశారు. ఒరిజినల్ దస్తావేజులు పోయిన వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా తమ ఆస్తి పత్రాలు ఎక్కడ, ఎలా పోయాయి? అనే వివరాలను పోలీసు శాఖకు సమాచారం అందించాలి. నిర్ణీత రుసుం చెల్లించిన తరువాత గడువులోపు ఆ విషయంపై పోలీసులు విచారణ చేసి ధ్రువీకరిస్తారు. అనంతరం మీ సేవా ద్వారా పోలీసు ఎఫ్‌ఐఆర్ పత్రం ఇస్తారు. ఎఫ్‌ఐఆర్, సీసీ పత్రాలతో సదరు ఓనర్ ఆస్తులను అమ్మే హక్కులు పొందుతారు.
NOTE : 2008 సంవత్సరం నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లకు మాత్రమే సర్టిఫైడ్ కాపీని మీ సేవ కేంద్రం ద్వారా పొందే అవకాశం ఉంది. అంతకంటే ముందు లావాదేవీలకు సంబంధించినవి కావాలని అనుకుంటే మాత్రం స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దరఖాస్తు సమర్పించి పొందాల్సి ఉంటుంది.