ప్రమాద సమయంలో నిర్లక్ష్యం – గాల్లో కలుస్తున్న ప్రాణాలు – ROAD ACCIDENTS IN TELANGANA
ఇటీవలి కాలంలో ప్రమాదం జరిగిన సమయంలో చరవాణిలో చిత్రీకరణకు ప్రాధాన్యం – కాపాడేందుకు ప్రయత్నించని జనం – కొందరి నిర్లక్ష్యం కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు
Road Accidents In Vikarabad and Medak District : ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి సమయోచితంగా వ్యవహరించడం ఈ కాలంలో ఎంతో అవసరం. ఇటీవలి పలు సందర్బాల్లో ప్రమాదం జరిగిన సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప కాపాడేందుకు మాత్రం అస్సలు ప్రయత్నించడం లేదు. ప్రమాద సమయంలో అవగాహన లేక, నిర్లక్ష్యం కారణంగా కొంతమంది విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆపదలో కాపాడాలన్న ఆలోచనే లేకపోతే చిన్నతనం నుంచి సముపార్జించిన అపార విజ్ఞానానికి విలువ ఉండదన్న విషయాన్ని అందరూ గ్రహించాల్సి ఉంటుంది.
తరచూ ఘటనలు : ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పాము కాట్లు, విద్యుత్తు అఘాదాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అలానే పెరుగుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆపద వేళ బాధితులను రక్షించాలన్న నైతిక బాధ్యత, ఆలోచన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పాము కాటేస్తే ఏం చేయాలి : పాము కాటేసిన వ్యక్తిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. ఏ పాము కరిచిందో గుర్తు తెచ్చుకునే నిర్ధారించుకోవాలి. శరీరాన్ని బిగుతుగా పట్టి ఉంచే చేతి ఉంగరాలు, ఆభరణాలు, బ్రాస్‌లెట్, తాడు వంటివి ఉంటే వీలైనంత త్వరగా తొలగించాలి. పాము కరిచిన ప్రాంతాన్ని కదలనీయకుండా త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి.
తొలి గంట లోపే : రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఘటన జరిగిన తొలిగంటలోపు (గోల్డెన్ అవర్) దవాఖానాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు నిలిచేందుకు అవకాశం ఉంటుంది. తలకు గాయమై చెవుల్లో నుంచి రక్తమోడుతున్నా, వాంతులవుతున్నా వైద్యుడి సలహాలు, సూచనలతో బాధితులకు చికిత్స అందించాలి. ఎముకలకు గాయాలైతే వాటిని వీలైనంత మేర కదలిక లేకుండా చూడాలి.
కుక్కకాటు : కుక్క కరిచిన చోట సబ్బు లేదా నీటితో కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది. బెటాడిన్ లేదా ఇతర యాంటీసెప్టిక్ ద్రావణంతో క్లీన్‌గా కడగాలి. గాయం అయిన దగ్గర బ్యాండేజీ కట్టాలి. సాధ్యమైనంత త్వరగా హస్పిటల్‌కు తరలించాలి.
విద్యుదాఘాతం : విద్యుదాఘాతానికి గురైన వ్యక్తిని ఆయా తీగల నుంచి వెంటనే వేరుచేయాలి. అందుకు పొడి రబ్బరు సాధనాలు, కర్రలు, చెక్కలు వంటి వాటిని వాడాలి. ఆలస్యం చేయకుండా చికిత్స అందించాలి. ప్రమాదానికి గురైన వారిని తక్షణమే చికిత్సకు దగ్గర్లోని హస్పిటల్‌కు తరలించాలి. ఈ విషయమై ఎవరూ భయాందోళనలకు గురి కావద్దు. ఎందుకంటే పోలీసుల వేధింపులు ఉండవు. దీనిపై ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రత్యేకంగా తీర్పునిచ్చింది.
“గుండెనొప్పితో పడిపోతే, వారిని పరిశీలించి శ్వాస తీసుకుంటుంటే సీపీఆర్ ప్రక్రియ చేయాలి. పాముకాటుకు గురైతే నాటువైద్యాన్ని అస్సలు ఆశ్రయించొద్దు. తొలిగంటలోనే వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నాడీ పట్టుకుని వేగాన్ని పరీక్షించే తీరుపై వేగంగా అవగాహన పెంచుకోవాలి” –డాక్టర్ అనిల్‌కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, జీజీహెచ్, సంగారెడ్డి జిల్లా