ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం – ఫాం హౌస్‌లో రూ.11 కోట్లు స్వాధీనం – LIQUOR SCAM DUMP IN HYDERABAD
శంషాబాద్లో అక్రమ మద్యం నగదు డంప్‌ను పట్టుకున్న ఏపీ సిట్ – సులోచన ఫార్మ్స్ గెస్ట్‌హౌస్‌లో 12 అట్టపెట్టెల్లో దాచిన నగదు పట్టివేత
SIT Seized Rs. 11 Crore Liquor Scam Money in Hyderabad : జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్రం శంషాబాద్లో మెరుపు దాడులు నిర్వహించిన ఏపీ సిట్ అధికారులు పెద్ద మొత్తంలో నగదు పట్టుకుని సీజ్ చేశారు. కేసులో ఏ40 నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు 12 బాక్సుల్లో నిల్వ ఉంచిన 11కోట్ల రూపాయలను సీజ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, కాచారం గ్రామంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్‌లో ఈ సోదాలు జరిగాయి. వర్ధమాన్ కళాశాల ఎదురుగా ఉన్న కాచారం గ్రామంలోని ఈ గెస్ట్ హౌస్ తీగల బాలారెడ్డి పేరు మీద ఉంది. రాజ్‌కేసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు, జూన్ 2024లో వినయ్ అనే వ్యక్తి సహాయంతో వరుణ్ పురషోత్తం రూ.11 కోట్ల నగదు ఉన్న 12 పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో ఇక్కడికి తెచ్చి ఉంచినట్లు సిట్ అధికారుల బృందం గుర్తించింది. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ దృష్టి సారించే అవకాశం ఉంది.
రూ. 3,500 కోట్లకు పైగా అక్రమాలు : మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్‌కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్దతలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశముందని సమాచారం. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మాటున పోగేసిన నోట్ల కట్టల డంప్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ముడుపుల సొత్తును దాచేందుకే అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు ఏడు డెన్‌లు సృష్టించుకున్నారు! అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్‌లు ఉన్నాయి.
అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు : మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి రాజ్‌కెసిరెడ్డి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో పేర్చి వాటిని ఆయా డెన్‌లలో దాచేవారు. బంజారాహిల్స్‌లోని నిర్మితీస్ ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్, జూబ్లీబిల్స్‌లోని సాయిశ్రీనివాసం అపార్ట్‌మెంట్, ఉమాస్ హిల్ క్రిస్ట్ అపార్ట్‌మెంట్, హైదర్‌గూడలో పడాల్స్ హౌస్, నార్సింగిలోని NCC అర్బన్ వన్ అపార్ట్‌మెంట్, నానక్‌రామ్‌గూడలో స్క్వేర్ అపార్ట్‌మెంట్‌లలో డెన్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ గతంలోనే గుర్తించింది. ఈ క్రమంలోనే కెసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో నేడు మరో డెన్ వెలుగులోకి వచ్చింది.
అంతిమంగా తాడేపల్లి డెన్కు : హైదరాబాద్ శివారు కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్‌హౌస్‌లో సోదాలు జరిపితే 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. నోట్ల కట్టలను ఎప్పటికప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేలా అట్టపెట్టెల్లో సర్ది ఉంచారు. ఇలా డెన్‌లలో సర్దిపెట్టిన డబ్బు అట్టపెట్టెలనే అంతిమంగా తాడేపల్లిలోని డెన్‌కు తరలించేవారని అనుమానిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపంలోని ది ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్‌లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అతని అనుచరులకు ఆ మద్యం ముడుపులు చేరవేసేవారు. అక్కడి నుంచి గతఎన్నికల్లో వైెఎస్సార్సీపీ అభ్యర్థులకు ఖర్చుల కింద పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది.
నగదు రూపంలోనే ముడుపులు : మద్యం డిస్టిలరీల యజమానులు, వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడం, దాచుకోవడం, పంపిణీ కోసమే మద్యం మాఫియా డెన్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించాలని ఆయా సంస్థలకు మద్యం మాఫియా షరతు పెట్టేది. అలాంటి కంపెనీలకే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ చెల్లింపులు జరపగానే ఆయా సరఫరాల కంపెనీలకు మద్యం మాఫియా తరఫున ప్రకాశ్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వెళ్లేంది. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ముడుపుల సొమ్మును నిర్దేశిత ప్రాంతాల్లోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారు.