టెన్త్ మెమోలు వచ్చేశాయ్ – కొత్త మార్పులతో ధ్రువపత్రాలు – మీరు చూశారా? – SSC MARKS LIST CHANGES TO MARKS
మార్కుల గ్రేడ్ లేకుండా విడుదల – పాఠశాలలకు స్పీడ్ పోస్టు ద్వారా మార్కుల జాబితాలను పంపించిన బోర్డు – మార్కులను గ్రేడ్లు రూపంలో ఇస్తామని తెలిపి ఫలితాలు సైతం అదే పద్ధతిలో విడుదల
Tenth Class Marks List Changes to Grades to Marks : పదో తరగతి వార్షిక పరీక్షల ఫైౖనల్ మార్కుల లిస్ట్‌ను బోర్డు విడుదల చేసింది. వార్షిక పరీక్షల తర్వాత మూడు నెలలకు వీటిని స్పీడ్ పోస్టు ద్వారా పంపడంతో సోమవారం పలు పాఠశాలలకు అందాయి. ఈసారి విడుదల చేసిన ధ్రువపత్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వార్షిక పరీక్ష ఫలితాల్లో గ్రేడ్‌లను తొలగిస్తున్నట్లు తెలిసిందే. వాటికి అనుగుణంగా విడుదల చేశారు.
పాఠ్యాంశాల వారీగా మార్కులు : గత సంవత్సరం వరకు ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్‌లు కలిపి మొత్తం ‘గ్రేడ్ పాయింట్లు’ ప్రకటించే వారు. ఆ తర్వాత ఇది విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు గుర్తించిన బోర్డు, 2024-25 విద్యా సంవత్సరంలో ఈ స్థానంలో నేరుగా మార్కులు కేటాయిస్తామని ప్రకటించింది. అలాగే వాటికి తోడు ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు, గ్రేడ్‌లు ఇస్తామని పేర్కొంది. ఇటీవల ఫలితాలు కూడా అదే పద్ధతిలో విడుదల చేసి సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు A, A1, A2 వంటి గ్రేడ్‌లతో విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ధ్రువపత్రాల్లో మొత్తం మార్కుల స్థానంలో ‘పాస్’ అని రాసింది. ప్రతి సబ్జెక్టు మార్కులు కూడితే తప్ప ఆ విద్యార్థికి వచ్చిన మొత్తం మార్కులు ఎన్నో తెలియవు. అలాగే వీటికి తోడు వార్షిక పరీక్షలు, ఇంటర్నల్స్ స్పష్టంగా చూపారు.
పెన్ నంబర్ ఆధారంగా నమోదు : గత రెండు సంవత్సరాల్లో విద్యార్థుల యూడైస్ స్థానంలో కేంద్రం యూడైస్ ప్లస్‌ను అమలులోకి తీసుకొచ్చింది. విద్యార్థి ఆధార్ సంఖ్య అనుసంధానంగా నమోదైన వివరాలతో పెన్ (పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్)ను ప్రతి విద్యార్థికి నమోదు చేశారు. దీని ఆధారంగా విద్యార్థి వివరాలు పూర్తిగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇకపై ఉన్నత చదువులకు వెళ్లినా, ఉద్యోగం సాధించినా ఈ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుంటారు.
ఇంటర్నల్ మార్కులు ఉంటాయ్ : పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉన్నాయా? లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న రాష్ట్రంలోని 5 లక్షల మంది విద్యార్థుల తలలో తిరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానంగా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలో మాదిరిగానే 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్ మార్కులు ఉంటాయని వెల్లడిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాల విద్యాశాఖ నిర్ణయం : ఇటీవల దిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వహించిన కార్యశాలలో ఈ నిర్ణయంపై పలు ప్రశ్నలు రావడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఈ కారణంగా పాఠశాలలు పునఃప్రారంభమై సుమారు రెండు నెలల అనంతరం పదో తరగతి ప్రశ్నపత్రాల సరళి వెల్లడించారు. 20 శాతం ఇంటర్నల్ మార్కులు ఉంటాయని తెలిపారు.
