సరోగసి పేరున సృష్టి ఆసుపత్రి దారుణాలు – పిల్లలను కొని ‘మీ బిడ్డే’ అంటూ మోసాలు – SURROGACY SCAM IN SRUSHTI HOSPITAL
సంతానలేమిని ఆసరా చేసుకున్న డాక్టర్ – సరోగసి అంటూ పిల్లలను కొనుగోలు చేస్తున్న నిందితురాలు – వారిని తల్లిదండ్రులకు మీ బిడ్డే అంటూ అందజేత – వైద్య వృత్తికే మచ్చ తెచ్చే వైనం
Surrogacy Scam in Srushti Hospital : అద్దెగర్భం ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నవజాత శిశువులను కొనుగోలు చేసి సరోగసీ పద్ధతిలో పుట్టినట్లు పిల్లల్లేని దంపతులకు అప్పగించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్ నమ్రత సహా 8 మంది నిందితుల్ని విచారిస్తే 30ఏళ్లుగా సాగిన అక్రమాల బాగోతాలు బయటకొస్తాయని భావిస్తున్న పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. మరోవైపు నిందితులు కూడా న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
పిల్లాడిని కొని విక్రయం : ఎంతోమంది చిన్నారులను తల్లి ఒడికి దూరం చేశారు. సరోగసీ ఎరవేసి ఎందరో దంపతులను మనోవేదకు గురిచేశారు. కాసుల కక్కుర్తితో అడ్డదారి తొక్కారు. తల్లిపిల్లల్ని వేరు చేస్తున్నామనే మానవత్వం మరిచారు. తప్పొప్పుల విచక్షణ గాలికొదిలేసి సంతానలేమిని సొమ్ము చేసుకునేందుకు ఎన్నో అక్రమాలకు తెరలేపారు. ఇదీ సికింద్రాబాద్‌లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో సాగిన దారుణాలు. పోలీసులు దర్యాప్తులో వెలుగుచూస్తున్న కొత్త విషయాలు ప్రస్తుతం ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజస్థాన్‌కు చెందిన దంపతులు సరోగసీ కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లోని డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. వారి వద్ద రూ.35 లక్షలు వసూలు చేసి సరోగసీ ద్వారా బిడ్డ పుట్టాడంటూ అసోంలో కొనుగోలు చేసిన పిల్లాడిని విక్రయించారు.
ఈ కేసులో గోపాలపురం పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 8 మందిని 7 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసు సోమవారం(నిన్న) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే 30 ఏళ్లుగా సాగించిన అక్రమాల బాగోతాలు బయటపడతాయని భావిస్తున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రతతో సహా 8 మంది నిందితులు నాంపల్లి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇది వరకే ఆసుపత్రిపై ఫిర్యాదులు : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బార్యభర్తలకు పెళ్లయి 18 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవటంతో 2019లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. వారి వద్ద రూ.13లక్షలు తీసుకొని సరోగసీతో బిడ్డను అందిస్తామంటూ నమ్రత భరోసానిచ్చారు. కొవిడ్ సోకి సరోగసీ చికిత్స అందిస్తున్న మహిళా మృతి చెందినట్లు బురిడీ కొట్టించారు. ఫెర్టిలిటీ కేంద్రం సాగిస్తున్న మోసాల గురించి తెలిసిన బాధితులు కేపీహెచ్‌బీ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
మరో ఘటనలో అమెరికాలో ఉంటున్న ప్రవాస దంపతుల నుంచి రూ.12లక్షలు తీసుకొని సరోగసీ బిడ్డ పేరుతో విశాఖపట్టణంలో కొనుగోలు చేసిన చిన్నారిని చేతికిచ్చారు. అనుమానం వచ్చిన వారు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. దీంతో అసలు నిజం బయటపడింది. 2015లో పోలీసులకు ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని కేంద్రాలకు వచ్చిన బార్యభర్తలకు వైద్యపరీక్షలు నిర్వహించి సరోగసీ కోసం విశాఖపట్టణం పంపుతున్నారు. అప్పటికే అక్కడకు వచ్చిన పేద, నిరుపేద మహిళలు, యువతులను సరోగసీకి సిద్ధంగా ఉన్నట్లు చూపిస్తారు.
పిల్లల రూపురేఖలపై అనుమానం రావడంతో : దంపతుల నుంచి వీర్యకణాలు, అండాలను సేకరిస్తారు. వాటిని ఏ మహిళ గర్భంలో ప్రవేశపెట్టబోతున్నామనేది వివరిస్తారు. ఏ మాత్రం అనుమానం రాకుండా గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కాబోయే తల్లిదండ్రులకు అందజేస్తుంటారు. డెలివరీ సమయం ముందుగానే చెప్పి విశాఖపట్టణంలో బిడ్డను అప్పగిస్తారు. పిల్లల రూపురేఖలపై అనుమానం వచ్చిన బాధితులు డీఎన్ఏ పరీక్ష చేసినపుడు అక్రమాలు బయటపడుతున్నాయి. తమ బిడ్డలు కాదని తెలిసినా విషయం బయటకు పొక్కితే శిశువులను కొనుగోలు చేసినందుకు తమపై కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో చాలా మంది మౌనం వహిస్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఏపీ, తెలంగాణ, ఒడిశా, అసోం, పశ్చిమబెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నిందితులు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పేద, నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులను టార్గెట్ చేసి వారికి డబ్బు ఆశచూపుతున్నారు. వారికి బిడ్డ పుట్టబోయే సమయాన్ని తెలుసుకుంటున్నారు. అక్కడ పుట్టిన పిల్లల్ని రూ.50వేల నుంచి రూ.లక్ష ధరకు కొనుగోలు చేసి ఇక్కడి దంపతులకు సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డగా చేతికిస్తున్నారు.
సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్లను అక్రమంగా ఏర్పాటు చేసి తమ వద్దకు వచ్చేవారిని తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన నవజాత శిశువులను అంటగట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీరిపై అనుమానంతో బాధితులు డీఎన్ఏ పరీక్షకు వెళ్లినప్పుడు తమ పిల్లలు కాదని గుర్తిస్తున్నారు. ఇన్నేళ్లుగా సరోగసీ ముసుగులో బాధితులకు అందజేసిన శిశువులను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఎంతమందికి ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాలను ఏం చేస్తున్నారనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది.