రాష్ట్రంలో భారీగా డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్ – కారణం తెలిస్తే రోడ్డెక్కరు! –
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించిన రవాణా శాఖ – భారీగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు – ప్రగతి నివేదికలో పలు అంశాల వెల్లడి
Suspension Of Driving Licenses Telangana : ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లుగా రవాణా శాఖ పేర్కొంది. 2023 డిసెంబరు నుంచి 2025 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లుగా వెల్లడించింది. మద్యం సేవించి లేదా మాదక ద్రవ్యాలు తీసుకుని, అతి వేగంతో డ్రైవింగ్ చేయడం లాంటి తీవ్ర ఉల్లంఘనలు ఇందులో ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో (ప్రొగ్రెస్ రిపోర్ట్‌లో) పలు అంశాలను వెల్లడించింది. ఆ వివరాలివి.
ప్రగతి నివేదికలోని ముఖ్యాంశాలివే :
- ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) పాలసీతో పరిమితి లేకుండా 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు.
- 2024 నవంబరు 16వ తేదీ నుంచి 2025 జూన్ 30వ తేదీ వరకు 49,633 ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు(ఈవీలకు) రూ.369.27 కోట్ల రోడ్ ట్యాక్స్ మినహాయింపును ఇచ్చినట్లుగా ప్రగతి నివేదికలో పేర్కొంది.
- డ్రైవింగ్ స్కిల్‌ను పరీక్షించేందుకు 25 బైక్‌ల ట్రాక్‌లు, 27 ఫోర్ వీలర్, 5 భారీ వాహనాల ట్రాక్‌లను అధునాతన టెక్నాలజీతో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లుగా మార్పు చేసేందుకు నిర్ణయం.
- ‘వాహన్’ అప్లికేషన్‌ను ఇతర రాష్ట్రాల మాదిరిగా అమలు చేయడం.
- ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి ఈ డిజిటల్ సేవల ప్రారంభం.
- వాహన ఉద్గారాలను పర్యవేక్షించేందుకు కాలుష్య టెస్టింగ్ సెంటర్లను(పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లు) కేంద్రీకృత ఐటీ ఆధారిత వ్యవస్థతో అనుసంధానానికి నిర్ణయం.
- రాష్ట్రానికి చెందిన వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ కోడ్ ‘టీఎస్’ను 2024 మార్చి 15 నుంచి ‘టీజీ’గా మార్పు చేసినట్లుగా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి 13.05 లక్షల వాహనాలు ‘టీజీ’ కోడ్‌తో మార్పు.
ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోయినా లైసెన్స్ రద్దు : మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? కొన్ని నెలలుగా ఆ బకాయిలు చెల్లించడం లేదా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు నిర్దిష్ట గడువు తేదీలోగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి నుంచి ఫైన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల కిందట భారత ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘించే వాహనదారులకు జరిమానాలను అనేక రెట్లు పెంచింది. అలాగే రోడ్డు భద్రతా నిబంధనలు పాటించనటువంటి డ్రైవర్లను శిక్షించేందుకు పలు చర్యలను కూడా ప్రతిపాదించింది.
చలాన్ 3 నెలల్లోగా చెల్లించాలి : తాజా ముసాయిదా రూల్స్ ప్రకారం వాహన యజమానికి ఫైన్ విధిస్తే, అతడు మూడు నెలల్లోగా ట్రాఫిక్ ఈ చలాన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. లేనట్లయితే అతడి లైసెన్స్‌ను రద్దు చేస్తారు. దీంతోపాటు ఒక ఆర్థిక సంవత్సరంలో రెడ్ సిగ్నల్‌ను దాటడం లేదా ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేసినందుకు మూడు చలాన్లు పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ కనీసం మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు రవాణా శాఖ నియమాలను పాటించాలి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు వరుసగా పాల్పడితే లైసెన్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.