UPI: Are you making UPI payments every day? You may receive a tax notice because?
UPI: ప్రతి రోజు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? మీకు ట్యాక్స్ నోటీసు రావచ్చు.. ఎందుకంటే..?డిజిటల్ చెల్లింపులు రోజువారీగా సర్వసాధారణం. కానీ చిన్న లావాదేవీలు ఒక ఏడాదిలో లక్షలు కావచ్చు. ఆదాయపు పన్ను శాఖ అటువంటి వాటిపై నిఘా ఉంచుతుంది. ఈ ఆదాయం పన్ను పరిమితిని దాటితే.. ITRలో చూపించాల్సిందే. నిజాయితీగా చెబితే ఎటువంటి సమస్యలు రావు.
డిజిటల్ యుగంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. టీ షాపు నుంచి షాపింగ్‌ల వరకు అంతటా యూపీఐ పేమెంట్సే. ఇవి మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. డైలీ ఎన్నో లావాదేవీలు చేస్తుంటాము. ఇప్పటివరకు యూపీఐకి ఎటువంటి ఛార్జీలు లేవు. దీంతో విరివిగా వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ మీరు చేస్తే ప్రతీది లెక్కలోకి వస్తుందనేది మర్చిపోవద్దు. ఉదాహరణకు.. మీరు గూగుల్ పే ద్వారా ప్రతిరోజూ ఎవరికైనా రూ.400 పంపితే.. అది నెలలో రూ.12,000 అవుతుంది. ఒక ఏడాదిలో ఈ సంఖ్య రూ.1 లక్ష కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ డబ్బు ఏదైనా సేవ లేదా పనికి బదులుగా ఇస్తుంటే దీనిని ఆదాయంగా చూసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో దానిని ITRలో చూపించాల్సి ఉంటుంది.
ఒకే అకౌంట్‌కు పదే పదే..
ఆదాయ పన్ను శాఖ పెద్ద లావాదేవీలపై మాత్రమే కాకుండా లావాదేవీల నమూనాపై కూడా నిఘా ఉంచుతుంది. ఒక వ్యక్తి పదేపదే వేర్వేరు లేదా ఒకే ఖాతాకు స్థిర మొత్తాన్ని పంపితే లేదా స్వీకరిస్తే.. అది ఆదాయం లేదా సేవ సంబంధిత కార్యకలాపాలు జరుగుతున్నాయనడానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో డబ్బు ఎక్కడి నుండి వస్తుందో, ఏ ప్రయోజనం కోసం వస్తుందో అధికారులు చెక్ చేయవచ్చు. యూపీఐ డేటా.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్యాంకుల ద్వారా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. ఈ డేటా ఏ ఖాతాలలో ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయో చెప్పేస్తుంది. అందువల్ల రూ. 100, రూ. 200 రోజువారీ చెల్లింపు చిన్నది అయినప్పటికీ.. క్రమం తప్పకుండా జరుగుతుంటే అది అధికారుల దృష్టిలోకి రావచ్చు.
లావాదేవీలు మాత్రమే పన్నుకు ఆధారమా?
మీ మొత్తం ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే, అటువంటి లావాదేవీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కిరాణా, పాలు, కూరగాయలు లేదా గృహోపకరణాలు వంటి ఖర్చులకు జరుగుతున్నప్పుడు. కానీ మీరు ట్యూషన్, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు లేదా చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే.. వాటికి వచ్చే పేమెంట్స్‌ను ఆదాయంగా పరిగణించి అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ ఆదాయం మీ మొత్తం ఆదాయానికి కలిపినప్పుడు..అది పన్ను పరిమితిని దాటితే.. అప్పుడు ఐటీఆర్‌లో చేర్చడం తప్పనిసరి అవుతుంది.
ఐటీఆర్‌లో పక్కాగా చెప్పాల్సిందే..
డిజిటల్ ఇండియాతో జవాబుదారీతనం కూడా పెరిగింది. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కోట్ల విలువైన లావాదేవీలను మాత్రమే కాకుండా, ఎన్నిసార్లు, ఎక్కడి నుండి, ఏ మాధ్యమం ద్వారా డబ్బు వస్తుందో కూడా చూస్తుంది. దీని అర్థం పన్ను వ్యవస్థ ఇప్పుడు మరింత సూక్ష్మంగా, డేటా ఆధారితంగా మారింది. మీరు డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపులు చేస్తుంటే లేదా స్వీకరిస్తుంటే.. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పూర్తి సమాచారం ఇవ్వడం మంచిది. నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడించడం ద్వారా.. భవిష్యత్తులో నోటీసు లేదా జరిమానా విధించే అవకాశం లేదు.