మందులు కొనేముందు వీటిని చెక్ చేయండి – లేదంటే అవి ప్రాణాంతకంగా మారొచ్చు! – VIGILANT WHEN BUYING MEDICINES
ఔషధాల కొనుగోలులో అప్రమత్తత అవసరం – ఏడాదిన్నరలో 186 నాసిరకం గుర్తింపు – నకిలీల దందా జోరుగా సాగుతోందని తేల్చిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.
Alertness Before Purchasing the Medicine : రోగం తగ్గించాల్సిన ఔషధాలు ప్రాణాంతకంగా మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు నకిలీ, నాణ్యత లేమి మందులను అమాయక ప్రజలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నగర శివార్లలో, బస్తీల్లోని కొన్ని మందుల షాపుల్లో నకిలీల దందా జోరుగా సాగుతోందని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నర సమయంలో తీసిన శాంపిళ్లను పరీక్షించగా దాదాపు అందులో 186 రకాల్లో క్వాలిటీ కొరవడినట్లు గుర్తించామని తెలిపారు. ఇవి పూర్తి నకిలీవని తేల్చారు.
వీటిని ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో తయారు చేసి తెలంగాణకు సప్లై చేస్తున్నారని అన్నారు. నిత్యం ఎక్కువ మంది వాడే మందులనే కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మందులు కొనేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సూచిస్తోంది.
ఈ జాగ్రత్తలు ముఖ్యం
ఔషధాలు కొనేముందు ప్యాకేజింగ్‌ని నిశితంగా పరిశీలించాలి. బ్రాండ్‌లో స్పెల్లింగ్ తప్పుగా ఉండటం, ఫాంట్‌సైజులో తేడా, లోగోలు సక్రమంగా కన్పించకపోవడం లాంటి లోపాలు ఉంటే వెంటనే గుర్తించి అనుమానించాలి.
నకిలీ మందుల తయారీలో గడువు తేదీ, బ్యాచ్ నంబరులో ఎలాంటి స్పష్టత ఉండదు. తప్పుడు చిరునామాతో వాటి ముద్రణలు ఉంటాయి. అనుమానాస్పదంగా అనిపిస్తే కంపెనీ అధికారిక వైబ్‌సైట్ ఓపెన్ చేసి చెక్ చేయాలి.
మందులపై కంపెనీల హోలోగ్రామ్ స్టిక్కర్లు, క్యూఆర్‌కోడ్స్ తప్పనిసరిగా ఉంటాయి. వీటిని స్కాన్ చేస్తే అసలు కంపెనీ సమాచారం మొత్తం ఉంటుంది. అందుబాటులో లేకపోతే నకిలీదని గుర్తించి వెంటనే ఔషధ నియంత్రణ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
మందుల ప్యాకేజీ, పాడై ఉండటం, రంగు మారడం, ఔషధం ఉన్న సీసాలు ఉబ్బడం, ప్యాకింగ్‌లోపల గోలీలు పిండిలా మారి కన్పిస్తే అవి నకిలీవని గుర్తించి అధికారులు దృష్టికి తీసుకెళ్లాలి.
తక్కువ ధర ఉండటం ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేసినా అనుమానించాల్సిందే.
ఇదీ లెక్క
ఎక్కువ కేసులు – రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లోనివి.
2024 జనవరి నుంచి 2025 జులై వరకు 7,200 మందుల శాంపిళ్లను పరిశీలించారు.
ఇందులో నకిలీవి, నాణ్యతలేనివి – 186 రకాలు ఉన్నాయి.
2025 జనవరి నుంచి 2025 జులై వరకు చెకింగ్ చేసిన సంస్థలు – 16,481
నిబంధనలు ఉల్లంఘించినవి – 2,827
700 కేసులు నమోదు అయ్యాయి
ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిబంధనల విషయంలో పక్కాగా తనిఖీలు చేపడితే నకిలీ దందాకు ముందుగానే అడ్డుకట్ట పడే అవకాశం ఉండేది. అయితే ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తుండగా డ్రగ్ కంట్రోల్ అధికారులేమో నిబంధనలు పాటిస్తున్నారా? అని పర్యవేక్షించకుండా అక్రమాలను ‘మామూలు’ గా తీసుకుంటున్నారు.
చర్యలకు ముందడుగు పడలేదు : గతంలో నకిలీ నమూనా మాత్రలు విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించినా ఆ తరువాత కట్టుదిట్టమైన పర్యవేక్షణలకు మాత్రం ముందడుగు పడలేదు. దుకాణదారులు కూడా ఎక్కువ కమీషన్ ఇచ్చే కంపెనీల మాత్రల విక్రయాలవైపే మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. తక్కువ ధరకు తమకు ఇస్తున్న ఆ ఔషధాలు నాణ్యమైనవేనా? నాసిరకమా? అన్న పట్టింపు దుకాణదారులకు ఏ మాత్రం లేదు. అధికారులు సైతం తనిఖీ చేయడం లేదు. రోగుల ఆరోగ్యం ఏమో కానీ తమ జేబుల్లోకి పైసలొస్తే చాలనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.